సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం.. లారెన్స్ సోదరుడి పనేనా!
on Apr 15, 2024
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబైలోనే బాంద్రా ప్రాంతంలో సల్మాన్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్స్ వద్దకు బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు.. తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నాడు. ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఈ కాల్పులు తామే జరిపామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. "సల్మాన్ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మేం ఏం చేయగలగమో నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇదే లాస్ట్ వార్నింగ్. ఈ సారి తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదు" అని హెచ్చరించాడు.
గతంలోనూ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ పై బెదిరింపులకు పాల్పడింది. విదేశాల్లో ఉంటూ ముంబైలో ఉండే తమ మనుషుల ద్వారా.. బిష్ణోయ్ గ్యాంగ్ ఇలాంటి బెదిరింపులకు, దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అన్మోల్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు.
Also Read